400 ఎకరాల విలువైన స్థలాన్ని గ్రీన్ మర్డర్ చేస్తున్నారు: కేటీఆర్

  • ఆ స్థలంలో బుల్డోజర్లు, జేసీబీలు తిరుగుతున్నాయన్న కేటీఆర్
  • వాటిని చూసి నెమళ్లు సాయం కోసం ఎదురు చూస్తున్నాయన్న కేటీఆర్
  • కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించిన ఫొటోలను షేర్ చేసిన కేటీఆర్
హైదరాబాదులోని హెచ్ సీయూ వద్ద 400 ఎకరాల విలువైన స్థలాన్ని ధ్వంసం చేస్తూ పచ్చదనంపై దాడి చేస్తున్నారని, ఆ ప్రాంతంలో బుల్డోజర్లు, జేసీబీలు తిరుగుతున్నాయని, వాటిని చూసి నెమళ్లు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ నెమళ్లు సాయం కోసం ఎదురు చూస్తున్నాయని పేర్కొన్నారు.

ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కంచ గచ్చిబౌలి సమీపంలోని భూముల్లో జేసీబీలు, బుల్డోజర్ల ఉన్న ఫొటోలను, రాత్రి వేళల్లో అక్కడి చెట్లను తొలగిస్తున్న వీడియోను ఆయన పోస్టు చేశారు.

హెచ్‌సీయూ సమీపంలోని గచ్చిబౌలి భూముల విషయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పటికైనా స్పందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇవన్నీ చూస్తూ కూడా రాహుల్ గాంధీ మౌనం వహిస్తే ఎలా అని ఆయన ప్రశ్నించారు.

ఇవి ప్రభుత్వ భూములే: టీజీఐఐసీ

కంచ గచ్చిబౌలి భూములు ప్రభుత్వానివేనని టీజీఐఐసీ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఇందులో హెచ్‌సీయూ భూమి లేదని తెలిపింది. 400 ఎకరాల భూమి ప్రభుత్వ ఆధీనంలో ఉందని, ఇది అటవీ శాఖ భూమి అని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని టీజీఐఐసీ తన ప్రకటనలో పేర్కొంది.

ఈ భూమి రెవెన్యూ రికార్డుల్లోనూ ప్రభుత్వ భూమిగానే నమోదై ఉందని వెల్లడించింది. అక్కడ నెమళ్లు, ఇతర జంతువులు లేవని తెలిపింది. ప్రపంచస్థాయి ఐటీ మౌలిక వసతులు, అనుసంధానత పెంపు, తగినంత పట్టణ స్థలాల లభ్యత అనే ప్రభుత్వ ప్రాధాన్యానికి ఈ ప్రాజెక్టు కట్టుబడి ఉందని పేర్కొంది.

KTR
Green Murder
Gachibowli Land Encroachment
Rahul Gandhi
TGIFCI
Hyderabad
Land Acquisition
Environmental Concerns
400 Acres Land
Illegal Construction

More Telugu News